Wednesday, May 14, 2008

ఈ వారం సిధ్ధా- బుధ్ధ (గోల్డు క్వెస్టు, మహిళా బ్లాగర్ల సమావేశం )

:::::::::


"అయ్య గారూ.."
"ఆఁ, సిద్ధా! "

"నాకు.. నాకు.. "
"ఆ నసుగుడెందుకు విషయం చెప్పు.. "

"నాకు సెలవులు కావాలి? "
"ఓస్ అంతేనా దానికెందుకు నసగడం. నువ్వడగడం నేను కాదనడమూనా. "

"మీరివ్వరని కాదు గానీ మొన్నా మా సంఘపోళ్ళు పెట్టిన మీటింగుకు వెళితే యజమానులను మెప్పించడమెలా అనే దాని మీద సెమినార్ ఇచ్చారు. అందులో, యజమానంటే భయపడుతున్నట్టు నటించడం ఒక టెక్నిక్ అంట. అందుకే అలా నసిగా. "
"బావుంది. నటించడమేనా ఇంకా గొడ్డళ్ళతో, గన్నులతో, పెన్నులతో భయ పెట్టి పనులెలా చేయించుకోవాలో కూడా చెప్పారా? "

"అది రెండో సెమినార్ లో చెబుతారంట. దానికి ఫీజు కట్టాలంట. "
"అలా అయితే నీకు పెర్మనెంట్ సెలవులు ఇస్తా. తీసుకుంటావా? "

"అయ్య బాబోయ్ అలా అంటా రేంటండీ. నేనేదో సరదాకెళ్తేనో. అది కూడా మా రంగడు బలవంత పెట్టి తీసకబోతే. "
"రంగడంటే గోల్డ్ క్వెస్ట్ గాడేనా? "

"అరె భలే గుర్తుపట్టేశారే. మీక్కూడా తెలుసా. "
"తెలుసా ఏంట్రా బాబూ, మొన్న నువ్వు బయటికెళ్ళినప్పుడు నీ కోసమొచ్చి గోల్డు క్వెస్టు గురించి చెప్పి నా మెదడు ఫలహారం కింద మింగేశాడు. . "

"రజనీకాంత్ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ అందరూ ఇందులో వుండారని చెప్పాడా? "
“వాళ్ళ పేర్లు చెప్పలేదు గానీ ఇంకో పది మెట్లెక్కి ఇందులో అమితాబచ్చన్, ధీరూ భాయ్ అంబానీ, ముఖేష్ అంభానీ, బిన్ లాడెన్, ఫీడెల్ కాస్ట్రో ఫ్యామిలీ వాళ్ళు కూడా వున్నారని చెప్పాడు. "

"వీడి దుంప తెగ. అమ్మో వీడు చంద్రమోహన్ దగ్గర ట్రైనింగు తీసుకున్నానని చెప్పాడే. చూడబోతే చంద్ర మోహన్ కే ట్రైనింగు ఇచ్చినట్లు వున్నాడు. వీడిని ఈ సారి మైకు పెట్టి సతికేస్తా. "
"సతికితే సతికావు గానీ తమ్మా రెడ్డి భరద్వాజ లాగ బి సీరీసు, జి సీరీసు పదాలు టి.వి. కెమరా ముందు మాట్లాడకు. పేపరోళ్ళు నిన్ను హెడ్లైన్లో పెట్టి నన్ను బాక్స్ అయిటం చేస్తారు. "

"మీరూరుకోండి. ఇప్పుడు పేపర్లో మన గురించి రాసేంత చోటెక్కడుంది వాళ్ళకి. అంతా ఉప ఎన్నికల గురించి రాస్తున్నారు. కొద్దో గొప్పో ఖాళీ వుంటే నాలుగేళ్ళ పాలనలో ప్రగతి అంటూ ఊదర కొట్టుకుంటారు. ఈ సారి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? "
"ఇంకెవరు టి.ఆర్.ఎస్. "

"మీరు కూడా అలా డిసైడయిపోయారా. ఏటూ వాళ్ళే గెలుస్తారని తెలిసినప్పుడు వాళ్ళ వల్లే ఎన్నికలొచ్చాయని వాళ్ళకు బుద్ది రావాలంటే ఓడించండి అని ఇతర పార్టీలు అరవడమెందుకు? హాయిగా వాళ్ళకే వదిలేసుంటే ఎన్నికల ఖర్చు మిగిలేది, సమయం ఆదా అయ్యేది. అప్పుడు మేమే అనవసర ఖర్చు ఆప గలిగాం అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకొని నిజంగా ఇది ‘మీ కోసం’ అని బాబు చెప్పుకొనుండచ్చు. వై ఎస్సేమో ఈ డబ్బును ప్రాజెక్టులకు ఖర్చు పెడతాం అని ప్రజల దగ్గర మార్కులేయించుకొని వుండచ్చు. ప్చ్... చాన్సు మిస్సయింది. "
"ఏంటి మీ సంఘం మొదటి సెమినార్లో ఇన్ని విషయాలు చెప్పారా? మీటింగుకు వెళ్ళొచ్చిన తరువాత తెలివి తేటలు బాగానే పెరిగాయే. "

"అప్పుడే ఏమయ్యింది బ్లాగులో మహిళ లందరూ సమావేశం పెడుతున్నరు గదా. మా ఆడది కూడా సమావేశానికి వెళతానని సంబర పడుతోంది. అప్పుడు చూడాలి నా సామి రంగా మా ఓల్ ఫ్యామిలీ తెలివితేటలు. "
"నిన్ను బ్లాగులు చదవమని చెబితే ఆ దురద మీ ఆవిడకు కూడా అంటిస్తావా? ఇంతకూ వాళ్ళేం మాట్లాడు కుంటున్నారో తెలుసా? "

"వాళ్ళు అసలు విషయం చెప్పట్లేదు. అందుకే గదా గూఢచారి లా మా ఆడదాన్ని పంపిస్తోంది. మీరు అట్లా ఏమీ తెలీనట్లు నటించండి. గుట్టంతా మా ఇంటిదాని చేత చెప్పిస్తా. అప్పుడు అవన్నీ మీ బ్లాగులో పెట్టుకోవచ్చు. "

"అవుడియా బానే వుంది కానీ. మీ ఆవిడ కూడా ఒక బ్లాగు మొదలు పెట్టేస్తే పరిస్థితి ఏంటి? "
"అవునండోయ్, అప్పుడు తాకిడికి గురయ్యేది మీ కంప్యూటరే. మనకు టైము దొరకదు. "

"వాళ్ళేమి మాట్లాడుకోని వుంటారో నాకు బాగా తెలుసు. "
"అదేదో నా చెవిన కూడా పడెయ్యండి. "

“... దు....”
"ఓహో అలానా...”

“.........కు.....”
"ఇంకా.... "

"…తె... "
"అమ్మా ఇవి కూడా? "

".....నా..... "
"అయ్య బాబోయ్"

"...లీ..... "
"నా కళ్ళు తెరిపించారు కదా. "

"రా........ "
"అలాగే ఎవరికీ చెప్పనులెండి. "

"వీళ్ళ మీటింగుకు నేదురుమిల్లి రాజ్యలక్ష్మిని పిలుచుంటే ఏమయ్యేది? "
"సమావేశం పేరు ప్రమదావనం కాకుండా ఇందిరా మహిళా బ్లాగర్ల సమేవేశం అయుండేది"

"వై.ఎస్. ను పిలుచుంటే? "
"సోనియమ్మ మహిళా బ్లాగర్ల సమావేశం అయుండేది. హైదరాబాద్ లో జరిగే సమావేశానికి రాజీవ్ బ్లాగర్ల సమావేశం అని పేరు పెట్టుకోమని పోరొచ్చుండేది"

"జగన్ ను పిలుచుంటే? "
"సాక్షి మహిళా బ్లాగర్ల సమావేశం అని పిలిచి అందరి ఫోటోలు తీసుకొని రెండు రూపాయలకే అన్ని పత్రికలూ రావాలని నినదించిన మహిళా బ్లాగర్లు అని ఫ్రంటు పేజి లో వచ్చుండేది. "

"బాబును పిలిచుంటే? "
"మీ కోసం మహిళా బ్లాగర్ల సమావేశం అని చెప్పి రోజాను పంపించి వుండే వాడు. "

"కె.సి.ఆర్. ను పిలిచుంటే? "
"............."

"చెప్పవేరా? "
"............"

"ఎందుకలా పారి పోతున్నావ్? "
"............"

"చెప్పు ఎందుకలా పారిపోతున్నావ్? "
"ఇంకా అర్థం కాలేదా?.... సింబాలిక్ గా చెప్పా. "



:::::::::

Tuesday, May 13, 2008

భ్లాగర్ల కథ ( నా వల్ల కాదు )

తప్పకుండా చదివాల్సింది:

పొద్దులో కొల్లూరి సోమశంకర్ గారు రాసిన బ్లాగర్లకో లేఖ చదివిన తరువాత నా డ్రాఫ్టు తవ్వకాల్లోంచి దీన్ని బయటకు తీసా. ఇది నూరో టపాగా విడుదల చెయ్యాల్సి వుండె. పూర్తి చెయ్యడం చేత కాక దీని బదులు బ్లాగోళ జంభ వీడియో విడుదలచేశా. పొద్దులో రాసిన సోమశంకర్ గారికి అభినందనలు. మీరింకా చదవక పోతే ఓ ట్రిప్పేసి తరువాత ఇక్కడికి రండి. ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇంకొక ఉదాహరణ. మీ బుర్ర స్క్రీన్‌ పై తళుక్కుమన్న "ఇలాంటివి మాట్లాడ్డం నీ కలవాటే గా" అన్న అక్షరాలు బర బర చెడిపెయ్యండి. మళ్ళీ నా మీద సెటైరెయ్యకండి.

తప్పకుండా చదవాల్సింది ఇంకొంచెం:

కింద రాసిన బ్లాగుల పేర్లే కాకుండా ఇంకా చాలా రాయాల్సి వుంది వాటిని రాయడానికి కుదరక మధ్యలో ఆపేశాను. ఇందులో ఉదహరించ బడ్డ బ్లాగు పేర్లకు, వాళ్ళ అసలు పేర్లకు, వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ బ్లాగు విధానానికి, వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ ఇంకా చానా చానాలకు ఏ మాత్రం సంబంధం లేదు.

-- ఇదే నా వీర శూర Disclaimer ...


కథ మొదలయ్యింది :

ఓ తెలుగు <విద్యార్థి> కి <తెర చాటు చందమామ> లా తెలుగు కోసం తపన పడుతున్న వాళ్ళెందరున్నారో తెలుసుకుందామనే కుతూహలంతో కలిగింది. పదుగురికి <ఏదో చెప్పాలనే> తపన రోజు రోజుకీ బలీయమయింది. ఇలా ఒంటరిగా <ఊహా ప్రపంచం> లో మునిగితే సరిపోదు. తనకున్న < తెలుగు తీపి> ఇంకా ఎంతమందికుందో తెలుసుకోవానే <తలపు> కలిగడం ఆలస్యం వెళ్ళి తన <అంతరంగాన్ని> వాళ్ళ <నాన్న> కి చెప్పాడు.

అది విన్న వాళ్ళ నాన్న చిత్తూరు నాగయ్య లాగా "ఇలా <మనసులోని మాట> చెప్పి <భాష ఊసులు> తెలుసుకోవాలనే <భావన> కలగడం ఎంతో సంతోషం. తెలుగు భాషా <అన్వేషి> వై బయలు దేరు. నీ అభీష్ట సిద్ధిరస్తు. ఎక్కడా నిరాశా, <నిస్పృహ> లకు లోను కాకుండా <పారదర్శి> వై దిగ్విజయంగా తిరిగిరా. తిరిగి వచ్చిన తరువాత నీవు <విన్నవీ-కన్నవీ>, <అవీ-ఇవీ> అన్నీ మాకు వినిపిస్తే మేము వాటిని <సంగ్రహాలయం> లో భద్రపరుస్తాం నాయానా. ఇదిగో ఇక్కడ నున్న మహిమాన్విత <కీలు గుర్రం> తీసుకెళ్ళు. దాని మీద కూచుని ఈ <శాస్త్రం> లో చెప్పబడిన విధంగా మంత్రం జపిస్తే నువ్వు కోరుకున్న చోటకు వెళుతుంది." అన్నాడు.

"అలాగే నాన్నా! <తపస్వి> అయిన మీరు నాకు <ఓనమాలు> దిద్దించి <అమృత వర్షం> లా వేదాల్నీ, పురాణాల్నీ అవపోశన పట్టించి నన్నింతగా తీర్చిదిద్దినరనే విషయం <నా మనో ఫలకం> పై ఎప్పటికీ వుంటుంది " అని చెప్పి సెలవు తీసుకున్నాడు.

విక్రమాదిద్యుడి సింహాసనానికికున్న <సాలభంజికల> రూపుతో చెక్కబడిన ఆ కీలుగుర్రాన్ని ఎక్కి మంత్రాన్ని జపించాడు. <సౌమ్యం >గా ఆ బొమ్మను ఒక్క సారి చరిచాడు. లయ బద్దమైన <సవ్వడి> చేసుకుంటూ మరుక్షణమే అది <స్వేచ్చా విహంగం> లా గాలిలోకి ఎగిరింది.

అది నిండు పౌర్ణమి. <జాబిల్లి> <వెన్నెల> విరబూసి పసిడి కాంతులు వెదజల్లుతోంది. అలా గాలిలో ఎగురుతూ తను ఇంతవరకూ ఆ అడవి లో తను చూడని ఎన్నో <చిన్న చిన్న అందాలను> చూసాడు. సన్నని జల్లు కురవడం మొదలైంది. తన ఒంటి మీద పడ్డ చినుకుల్ని చూసి <వెన్నెల చినుకులంటే > ఇవే నేమో అనుకున్నాడు. కాసేపు సేద దీరుదామని కిందికి దిగాడు. అక్కడ <హరివిల్లు> లా వంగిన పూల తీగల పొద దగ్గిర ఆసీనుడయ్యాడు. ఆ పూల పొద పక్కనున్న బావిలోకి వంగిన చెట్ల కొమ్మలకు కట్టుకున్న <గిజి గాని> గూళ్ళు వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించాయి. ఆ అందాలను అలానే చూస్తూ వుండగా నిద్ర పట్టేసింది. ఊదయ భానుని లేత కిరణాలు మీద పడుతుండగా <వసంత కోకిల> కిల కిలా రావాలకు నిదుర లేచాడు. కాల కృత్యములు తీర్చుకుని అక్కడ కింద పడ్డ రేగు <పండు> ను చూశాడు. అక్కడ రేగు పండు వుండిన ఎడల ఇంకా ఏమైన ఫలములు దొరుతాయేమో నని వెదికిన తరువాత <బృందావనం> లాంటి ఆ వనంలో అన్ని రకాల చెట్లు కనపడ్డాయి. వాటిని కడపు నిండా తిని కీలు గుర్రమెక్కి <కళార> ను <మహా సముద్రాన్ని> దాటి కొంచెం వెళ్ళగానే ఆ వాతావరణం కొత్తగా అనిపించిది. ఇదే <ఆంధ్ర పర్యావరణం> కాబోలు అనుకున్నాడు. తను ముందుగా వెళ్ళాలనుకున్న ఆంధ్ర దేశం రాజధాని వైపు గుర్రాన్ని తిప్పాడు. కాసేపటిలో గోల్కొండ, బుద్ధ విగ్రహం కనిపించాయి. వాటిని చూడగానే కీలు గుర్రం వింత శబ్దం <ఎహెహీహీఎ> అని చేసింది. విద్యార్థి కి అర్థం మయిపోయింది ఇక్కడ ఏదో వాతావరణ కాలుష్యముందని. అందుకే కీలూ బొమ్మ కూడా తన బాషలో <నా గోల> అర్థం చేసుకో అని అరిచింది. హైద్రాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు ఆరు కిలోమీటర్లు దూరంలో గుర్రాన్ని ఆపి <తేలుగు నేల> పై అడుగుపెట్టాడు. అక్కడనున్న పొదల పక్కన ఆపేసి దాని మీద కొన్ని ముళ్ళ కంపలు పరిచేశాడు.

పొదల సందుల్లోంచి <ఋ ౠ> అనుకుంటూ గుర్రం ఆగిపోయింది. అక్కడి నుండి దిగి నడిచిన తరువాత నల్లగ నిగనిగ లాడుతున్న నాలుగు రోడ్ల <కూడలి> కనిపించింది. <కలగూర గంప> లాగా వున్న రోడ్డును చూసి ఎటు పోవాలో అర్థం కాక రోడ్డు కూడలి దగ్గర నిలుచున్నాడు. రోడ్డు పక్కనే <కబుర్లు> చెప్పుకుంటున్న ఇద్దరు రైతులు కనిపించారు. దగ్గరకు వెళ్ళి వాళ్ళను పలకరించాడు. తన వేషం కూడా దాదాపు వారి లాగే వుండటం వల్ల వాళ్ళు అప్యాయంగా పలకరించారు. హైద్రబాదు కు వెళ్ళు అని వాళ్ళు చెప్పిన వైపు నడక సాగించాడు. రోడ్డు మీద వచ్చే పోయే వాహనాలను చూసి <ఆంధ్ర ప్రగతి> చాలా వుందనుకొన్నాడు. సాయంత్రానికి చార్ మినార్ చేరుకున్నాడు. అక్కడ రోడ్డు దాటడానికి నానా తంటాలూ పడవలసివచ్చింది. ఇదేదో <జగమే మాయ> లాగా వుంది ఎవరో ఒకరి సహాయం తీసుకోకపోతే కష్టమే అనుకొన్నాడు. అంతలో <ఈ-తెనుగు> చొక్కా వేసుకొనొకతను కనిపించాడు. హమ్మాయ్యా ఇతనెవరో <తెలుగబ్బాయ్> లాగా ఉన్నాడని అతన్ని ఆపి "చూడు <తెలుగోడా>!<త్రినేత్రుడి> కి కూడా ఈ రోడ్డు దాటటం కష్టం. దీన్ని దాటాలంటే నాకు ఎన్నో <ధర్మ సందేహాలు> వస్తున్నాయ్. వాటిని తీర్చగలవా" అని అడిగాడు.


"చూడూ! నా పేరు తెలుగోడా కాదు <ఫణి పక్కా తెలుగబ్బాయ్>. ఇదిగో అక్కడ <బడి పిల్లగాళ్ళు> రోడ్డు దాటుతున్నారు. వాళ్ళతో పాటు నిన్ను రోడ్డు దాటించేస్తా రా. నేను నా <ఫ్రెండ్స్> ను కలవాలి" అని చెప్పి రోడ్డు దాటించేసి వెళ్ళి పో యాడు.

"నారాయణ..<నారాయణ> , ఏడు కొండలవాడా <వెంకట రమణ>" అనుకుంటూ రోడ్డు దాటేశాడు. రోడ్డు దాటిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఇదంతా <జగమే మాయ> గా వుంది. ఆ <జగన్నాటక> సూత్రధారి ఇక్కిడి కొచ్చినా ఎవరూ పట్టించుకోరు అని అనుకొంటూ వున్నాడో లేదో ఎవరో తన చేతిలో ఒక కర <దీపిక> పెట్టేసి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది తెలుగు పుస్తక మహోత్సవం గురించి, అక్కడ జరగనున్న సాంస్కృతిక మహోత్సవాల గురించి. ఏలాగైనా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు. ఈ సారి ఎవరి నైనా అడుగు దామంటే ఎవరూ ఖాళీ గా కనిపించలేదు. ఫ్రతి వాళ్ళూ చెవిలో సెల్ ఫోను పెట్టుకొని నా గోల నాది అన్నట్టుగా వున్నారు. అక్కడ బైక్ ఆపి <నా గోల> అనుకుంటూ మాట్లాడున్న ఒక యువకుడి దగ్గర నిలుచున్నాడు. స్పీకర్ ఫోను పెట్టి మాట్లాడుతున్నందువల్ల అన్నీ వినిపిస్తున్నాయి.
"జలజా నేను చెప్పేది విను.నేను తొందరగా వచ్చేస్తా"
"నువ్వెంతసేపూ నేనూ <నా సాహిత్యం> అంటూ తిరగడమే కానీ నన్ను పట్టించుకోవా"
"నువ్వే నా ప్రాణం. <నా మనసు> నీకు తెలుసు కదా నే రాసిన <నా రాతలకు> ఎప్పుడో ఓ సారి సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. అలా వస్తే అందులో నీకే గదా సగం దక్కేది"
"<నిజం> గా తొందరగా వచ్చేస్తారు కదూ"
"నువ్వలా ఎదురు చూస్తూ వుండు. <అభిరాం> హోటల్నుండి <పూత రేకులు>, <కిరణ్> ఫ్లవర్ మర్కెట్ నుండి <సన్న జాజులు> తీసుకుని వచ్చేస్తా" అని ఫోను పెట్టేశాడు.
ఇతను కూడా పుస్తక ప్రదర్శనకు వెళ్తున్నట్టున్నాడు ఇతన్ని లిఫ్ట్ అడిగితే పోలా అని దగ్గరకెళ్ళి అడిగాడు.

కథ ఆగిపోయింది.

(అంతే ఇంకా 280(అప్పట్లో) బ్లాగులున్న పేర్లతో ఈ ట్విస్టులతో రాయడం కుదరని "హ్యాండ్స్ అప్" అన్నా.)

సోమశంకర్ గారు,

మీరు రచయిత కాబట్టి అయ్యవారి బొమ్మ అనుకున్నారు అదే వచ్చింది. నేను గీసింది ఎలా వచ్చిందో చూడండి. మీ రాతకు టొపీ తీశాను.

-- విహారి

(ఈ టపా పోస్టు చెయ్యకూడదని చివర్లో ఆపేశా. కానీ ఇవాళ ఫణి గారు ? నాడు-నేడు కు కామెంటుచేస్తూ కాన్‌సెప్టు ఎవరైనా కాపీ చేశారా అన్నారు. ఏటూ ఆ ఇమేజీ వచ్చింది కదా అని సంక్రాంతి సినిమాలప్పుడు పెద్ద సినిమాల్తో పోటీ పడి చిన్న సినిమా రిలీజ్ అయినట్టు రిలీజ్ చేసేస్తున్నా )


త్వరలో రాబోయే టపా : బ్లైన్‌,బ్లిస్కీ,బ్లోడ్కా,బ్లీరు తాగేసి బ్లాగడమెలా

Friday, May 09, 2008

నాడు -- నేడు

* * * *


నాడు :

"రేయ్ నిద్దర లేసినావా?" ఇనప గ్రిల్లుకు అద్దం తగిలిచ్చి పెట్కొని స్టూలు మింద పెట్న మగ్గులో నీళ్ళు పోసుకుని, పనామా బ్లేడు తో గడ్డం గీసుకుంటున్న నాన్న అరుపు.
"...."

"రేయ్ నిన్నేరా పిలిసేది. రేత్రంతా లైట్ పోలుకింద మినకర్ బూసిల్తో ఆడి ఇబ్బుడు లెయ్యమంటే రగ్గు కప్పుకోని ఆ పక్కకు తిరగతావా. నిద్దర బొయింది జాలు గానీ లెయ్. "
"ఊ.." ఇంట్లో నవారు మంచం మింద ఆప్కో దుప్పటి కప్పుకొని పండుకున్న కొడుకు.

"పండుకునింది చాల్లే వాయ్. లేసి గూట్లో పెట్న గోపాల్ పండ్ల పొడితో పండ్లు తోముకో. మీ యమ్మ పొయ్యి మింద వుడుకు నీళ్ళు పెట్టింది నీ కోసరమని.బిర్నే లెయ్ లేక్పోతే నీళ్ళు సల్లగయిపోతాయ్. "
"ఊ... నైనింగారుంతసేపు పండుకుంటా"

"రేయ్ నిన్ను.. నీకిట్ల జెబ్తే యాడ లేస్తావ్. నీకిచ్చేది ఇచ్చెయల్లలే . ఆ కట్యాడికి బొయ్యింది.." కట్టి కోసం నాన్న ఎదకతా వుంటాడు.
"ఓయమ్మా నన్ను కొట్టద్దు సామీ నేను లేస్తా.." కొడుకు లేచి బచ్చల్లోకి పరిగెత్తి పూడస్తాడు.

అర్ధ గంట తర్వాత…

తలకు జిడ్డాముదం పెట్టి కుడి పక్కకు దువ్విన క్రాపుతో, నల్ల పట్టీల తెల్ల చొక్కా, వి షేపు ఎర్ర నిక్కరు ఏసుకోని ఉప్మా తట్ట ముందు స్కూలు కెళ్ళే కొడుకు ప్రత్యక్షం.

నేడు:

"నాన్నా కొండలూ.." తన రూములో నుండి లేచి బ్రష్ చేసుకొని, ఆటోమటిక్ షేవర్ తో షేవింగ్ చేసుకుంటూ కొడుకు రూములో అడుగు పెడతాడు నాన్న."గుడ్ మార్నింగ్ నాన్నా! లేయ్. స్కూలుకు టైమవుతోంది"
"ఊహూ..."

"నాన్నా! అదిగో చూడు అందరు పిల్లలూ రెడి అయిపోతున్నారు. స్కూలు బస్సు కూడా వచ్చేసింది."
"ఊ.. ఐ వాంట్ టూ స్లీప్ ఫార్ సమ్మోర్ టైం"

"స్కూలుకు టైమయిపోతుంది కన్నా."
"ఊ హూ.. ఐ సెడ్ ఐ వాంట్ టూ స్లీప్ ఫార్ సమ్మోర్ టైం. "

"అదిగో నీ రూములోకి ఎలకొచ్చింది…"
"ఊ.."

"ఇదిగో పిల్లి కూడా వచ్చింది..మ్యావ్..మ్యావ్"

దుప్పటి కొద్దిగా తెరుచుకుంటుంది ఒక కన్ను మాత్రం దుప్పట్లోంచి బయటకు వస్తుంది.

"అదిగో నీ బ్లాంకెట్ లో కొచ్చింది.."
"ఎక్కడా?"

"ఇదిగో ఇక్కడ"
"ఐ డొన్ ట్ సీ ఇట్.."

"మ్యావ్..మ్యావ్.."
"నో..నువ్వే పిల్లి.."

"ఇదిగో లేచేశావ్. వెళ్ళి బ్రష్ చేసుకో"
"నో.." దుప్పట్లోకి మళ్ళీ.

"అదిగో ఈ సారి పులొచ్చింది...గాండ్రు...గాండ్రు..."
"నో నువ్వే పులి.."

(అలా బోలెడన్ని క్రూర జంతువుల్ని , ఎగిరే పక్షుల్ని, పాకే పాముల్ని, గెంతే కప్పల్ని రూములోకి రప్పించిన తరువాత.)

"అదిగో లేచేశావ్. దా బ్రష్ చేసుకో నాన్నా. స్కూలుకు టైమవుతోంది ”
"అయితే నన్నెత్తుకో" దుప్పట్లోనుండి కొడుకు.

అలా ఉప్పు మూట ఎత్తుకుని బాత్ రూములోకొచ్చి బ్రష్ మీద పేస్టు పెట్టిస్తే రెండు సార్లు లెఫ్టూ రెండు సార్లు రైటూ చేసి బ్రష్షు మళ్ళీ నాన్న చేతిలోకొచ్చేస్తుంది. అప్పుడు నాన్న మిగిలిన లెఫ్ట్లూ, రైట్లూ, అప్ లు, డౌన్ లు చేసి కొడుకును షవర్ లోకి తోస్తాడు.

అర్ధ గంట తరువాత...

లోపల పొడుగు చొక్కా వేసి దాని మీద ష్రెక్ పొట్టి చొక్కా వేసి మడచిన జీన్స్ పాంటూ, పాలిష్ చేసిన బూట్లు వేసుకొని నెత్తిన చిన్న క్యాప్ పెట్టుకొని (ఒక్క ముక్కలో పోకిరి స్టైల్లో ) డైనింగ్ టేబిల్ మీద వున్న ప్యాన్ కేక్ (తీపి అమెరికన్ దిబ్బ రొట్టె) తింటానికి రెడీ.

* * * *