:
ఈ ఐ ఫోనుకు ఎన్టీఆర్ కు లంకెంటని “హా”శ్చర్య పోకండి. నేను మాట్లాడ బోయేది క్రేజు గురించి అనగా వెర్రి వేయి టైపులు గురించి .
మొన్నా మధ్య అంటే కొన్ని నెలల క్రితం షాపింగ్ కు వెళితే Best Buy షాపు పక్కన సందులో కుర్చీలు వేసుకుని బీరు తాగుతూ, దుప్పట్లు కప్పుకుని ల్యాప్ టాప్ మీద సినిమాలు చూసుకుంటున్నారు కొంత మంది. ఏంటి సంగతి అని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఆ రోజు రాత్రి హ్యారీ పాటర్ పుస్తకం విడుదల అవుతోందట. దాన్ని కొనటానికి అలా లైన్లో ఎదురుచూస్తున్నారు. ఆ పుస్తకం మీద వాళ్ళకున్న మక్కువ అంతది మరి. ఇలా ఎంత మందున్నారో అని చూస్తే అది కాస్త హనుమంతుడి తోక లాగా పక్క షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళింది. ఇలాంటి లైను గనుక మన దగ్గర వుంటే “చాయ్..చాయ్ గరం చాయ్“ అని బక్కెట్లో కప్పులేసుకుని అమ్మేవాళ్ళూ, “ టైం పాస్ బఠాణీ సార్, టైం పాస్ బఠాణీ సార్” అని గంపలో రూపాయి పొడవు కూడా లేని చుట్టిన పేపర్లో వేసిన బఠాణీలు అయిదు రూపాయలకు అమ్మేవాళ్ళూ కనిపిస్తారు. ఇక్కడ (అమెరికా) అభివృద్ధి చెందేసిన దేశం కనుక అలాంటి కప్పులోళ్ళను, బఠాణీ గాళ్ళను రానివ్వరు. వారి స్థానాల్లో కెమరాలూ, మైకులు పట్టుకున్న ముద్దు గుమ్మలు కనిపిస్తారు. పైన ఏ “9 న్యూస్” వాడో “తొంభై తొమ్మిదో న్యూస్” వాడో హెలికాప్టర్ లో నుండి ఇంకో కెమరా కిందికి పెట్టి ఫీట్లు చేస్తూ ఆ లైను చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఏ దిక్కుమాలినాడో రాత్రంతా మేల్కొని పొద్దున్నే ఎండ బడకుండా ఓ పుస్తకాన్ని మొహమ్మీద వేసుకుని గురకలు పెట్టేవాడు కనిపిస్తే వాడి ముఖాన్ని క్లోజప్ లో చూపిస్తారు. ఇలాంటి సీను మళ్ళీ ప్రత్యక్షం ఇప్పుడు ఐఫోన్లకోసం.
అసలు విషయంలోకి వచ్చేముందు మన క్రేజు గురించి కొంచెం. నేను మదనపల్లె లో ఇంటర్ చదివేటప్పుడు మా రూము పక్కన ఒక టీ కొట్టు వుండేది. అందులో మస్తాన్ అని ఒక ఎన్టీఆర్ వీరాభిమాని వుండేవాడు. అవి జస్టిస్ చౌదరి, కొండ వీటి సిం హం లాంటి అన్న గారి సినీ జగత్తు శుక్ల మహర్దశ రోజులు. మస్తాన్ టీ కొట్టులో పనిచేస్తున్నందుకు రోజుకు మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు. అతనికి ఇల్లు కూడా వుండేది కాదు. ఆ వీరాభిమాని అన్న గారి ఫోటో ఫ్రేము ఒకటి చేయించుకున్నాడు ఓ ఇరవై రూపాయలు పెట్టి. దాన్ని దాచుకొనేదానికి స్థలం లేక మా రూములో పెట్టేవాడు. రెండు మూడు రోజులకొకసారి రూముకు వచ్చి ఆ ఫోటో తీసి తనివి తీరా చూసుకుని మళ్ళీ ఆ ఫోటో రూములో భద్రంగా పెట్టి వెళ్ళి పోయేవాడు. పరీక్షలయిపోయాక మేము రూము ఖాళీ చేసేటప్పుడు ఎంతో బాధ పడ్డాడు ఆ ఫోటో పెట్టుకోడానికి మళ్ళీ భద్రమైన చోటు దొరుకు తుందో లేదోనని.
ఐఫోన్లో కొస్తే ఈ ఐఫోన్ల గురించి ఇప్పటికే తెలుగు బ్లాగుల్లోకి వచ్చేశాయి వాటి గురించి ఇక్కడోసారి , ఇక్కడోసారి, ఓపికుంటే ఇక్కడింకోసారి చదువుకోవచ్చు. ఈసారి మాత్రం దీని క్రేజు బాగా నషాలానికంటింది (స్పెల్లింగ్ ప్లీజ్..) మన శివాజీ సినిమా లాగా. వాడెవడో శుక్ర వారం సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే ఐ ఫోను కొనడానికి సోమ వారం పొద్దున 4 గంటలకు న్యూయార్క్ ఆపిల్ స్టోర్స్ ముందు కుర్చీ వేసుకుని ఎదురుచూస్తున్నాడట. ఇంకోడెవడో దీన్ని కొనటానికి వాడి బైకూ, కారూ రెండూ అమ్మేశాడట ( రెండూ కలిపి అయిదొందల డాలర్లు చెయ్యలేదేమొ). టి.వి. లో వార్తలు పెడితే చాలు ఎవడో ఒకడి ముక్కులో మైకు పెట్టైసి వాడు చెప్పే సోది అంతా వినిపించేస్తున్నారు. వాడు వాడి జబ్బ మీద వున్న తేళ్ళూ పాముల పచ్చ బొట్లు చూపిస్తూ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఇంకొకావిడెవరో నోట్లోని నాలుక మీదున్న రింగులు బయటికి వెళ్ళబెట్టి "నా రింగూ.. ఐ ఫోను రంగూ" అని పళ్ళికిలించేస్తోంది. అందరూ శుభలేఖ సినిమాలో సుధాకర్ అన్నట్టు "బికాజ్ ఐ లవ్ ఐఫోన్" అంటున్నారు.ఇలా లైన్లో వున్నోళ్ళకు నీళ్ళూ, జ్యూసులు అందించే ధర్మ దాతలు కొందరు.
ఇదిలా వుండగా ఆపిల్ కంపెనీ వాళ్ళ లెక్క ప్రకారం 2010 కి వీళ్ళు ఒక కోటి ఐఫోన్లు అమ్ముతారంట. మన GDP ఇప్పుడు ఒక బిలియెన్ డాలర్లు(1$=40Rs). అంటే 2010 కి వాళ్ళ అమ్మకాలు ఇప్పటి మన GDP కి అయిదింతలు.
మన భారత్ లో 2008 కి కానీ విడుదల కావట. కొసమెరుపెంటంటే వీటిని $25 కి unlock చేస్తామని డిల్లీ పాలిక బజార్ వాళ్ళు చెబుతున్నారట. జై హైటెక్ భారత్.
:
లేఖిని వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.
:
:
లేఖిని వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.
:
కొండలు నిర్మించబడతాయి ఇలా.
రోజుకు మూడు బీర్లు తాగి సోఫా మీద వేసి తాగేసిన టీ కప్పులు సింకులోకి విసిరేసి వదిలేసిన బట్టలు గుట్టగా పడేసి ఇంటికొచ్చిన ఉత్తరాలు చింపి పోసి
ఇంకా అడ్డూ ఆపు లేకుండా
అన్ని రూముల్లో ఒకే చానల్ పెట్టుకొని ఇల్లంత తిరగొచ్చు. నో చక్రవాకం, నో లక్ష్మి, నో ఝాన్సీ…నో సీరియెల్స్. నో వంటా వార్పూ చానెళ్ళు. షేవింగ్ చేసుకునేప్పుడు కొళాయి తిప్పెయ్యొచ్చు నిరంతరంగా. టూత్ పేస్టు మూత ఒపెన్ చేసి పెట్టచ్చు. పాలు ఎన్ని సార్లయిన పొంగించొచ్చు బర్నర్ మార్చుకుంటూ.
ఆహా ఏమి హాయిలే.
:
:
లేఖిని వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.
:
ఈ మధ్య నాకు నచ్చని టపాలు కొన్ని వస్తున్నాయి.వాటిని అరికట్టాలనే కోరికతో ఎంతో వినూత్నమైన, విశిష్టమైన, విలక్షణమైన, విభీషణమైన,భయంకరమైన, భీభత్సమైన, రౌద్రమైన....ఇంకా....ఇంకా ఇలాంటి వెన్నో లాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టా. ఈ దెబ్బ తో నాకు నచ్చని "ఖిచ్ ఖిచ్" టపాలన్నీ మాయం. అదేమిటంటే చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నా. నాకు నచ్చని బ్లాగుల పేర్లు దిష్టి బొమ్మలాగా, బూడిద గుమ్మడికాయ లాగా, నల్ల తాడుకు చుట్టిన పటిక రాయి లాగా, ఎండి పోయిన నిమ్మకాయ లాగా ఇక్కడ వేలాడ దీస్తాను. అంటే గింటే ఏమీ లేదు అలాంటి వాటిని ప్రతి రోజూ "ఈ రోజు నాకు నచ్చని బ్లాగు(లు)" కింద వాటి పేర్లు వేలాడ దీస్తా. మళ్ళీ అంటే ఇది కూడలికి(తేనెగూడు, తెలుగుబ్లాగర్స్ కు కూడా) దిష్టి చుక్కన్నమాట. ఎన్ని దిష్టి చుక్కలున్నాయో చూసుకోవాలంటే పక్కనో లుక్కేయ్యాలి.
:
:
లేఖిని వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
హమారా కోచ్:
క్రికెట్ మీద సినిమాలు రాలేదన్న క్రికెట్ అభిమానుల దురద ఈ సినిమా తీరుస్తుంది. “దురదాకు పూసుకున్నోడికి గోక్కున్నంత” అనే ట్యాగ్ లైన్ చక్కగా నప్పుతుంది. మన దేశ క్రికెట్ తీరుతెన్నుల గురించి అందులో మన క్రికెట్ భవిష్యత్తు గురించి ఎంతో పాటుపడుతున్న కొందరు ICCB పెద్దలు తీసిన ఈ చిత్రం ఈ మధ్య వచ్చిన సస్పెన్స్ మరియూ హారర్ చిత్రాలను మరిపించింది. మొదట వై మోర్ ను కోచ్ గా తీస్కుని వస్తామని బాగ ప్రచారం కల్పించి జాన్ జింబురే ని కోచ్ పదవికి పరిశీలిస్తున్నామని చెప్పి ప్రేక్షకులను ట్విస్టుకు గురి చేస్తాడు దర్శకుడైన దురార్. విదేశీ కోచ్ వద్దన్న గనిల్ సువాస్కర్ జాన్ జింబురే పేరును ప్రతి పాదించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. క్లైమాక్స్ లో వై మోర్ ను , జాన్ జింబురే ను కాదని ఇంకొకరిని ఇంటర్వూ కి పిలిచి అతన్ని సెలెక్ట్ చేశామని చెబుతారు ICCB పెద్దలు. చివరకు అతను కోచ్ పదవిని స్వీకరించాడా లేదా? అతను భారత దేశానికొచ్చిన తరువాత ఎదురుపడ్డ ప్రమాదకర సన్నివేశాల్ని ఎలా ఎదుర్కొంటాడు అన్నవి తుంగ పార్కర్ స్క్రీన్ ప్లే లో తెలుసుకోవాల్సిందే. తప్పక చూడండి మీ అభిమాన క్రికెట్ టి.వి. లో.
ది ప్రెసిడెంట్:
ఇది సమిష్టిగా మూడు కూటములు కలిసి తీసిన చిత్రం. దర్శకులు ఇంకా ఎక్కువే. తెర మీద పేర్లు అయిపోగానే ప్రేక్షకులందరికి అర్థమయిపోతుంది వచ్చే ప్రెసిడెంట్ ఎవరో. అధికార పక్షం నిలిపిన అభ్యర్థే అందునా మహిళా రాష్ట్రపతి వస్తున్నారని అందరూ అనుకున్నంతలో మూడో కూటమి తయారయి అంతవరకు ప్రజల మన్నలు పొందుతున్న రాష్ట్రపతి పేరును తెర పైకి తీసుకు రావడంతో మొదలవుతుంది అనుకోని ఉత్కంఠ. ఎవరు నామినేషన్ వేస్తారో, ఎవరు విత్ డ్రా చేసుకుంటారో, ఎవరు గెలుస్తారో అనే ఉద్విగ్నం కలుగుతుంది. ఒకర్ని మించి మరొకరు స్వచ్చమైన రాజకీయ పరిభాషలో ‘సంప్రదాయకరంగా’ మాట్లాడుకుంటారు. అక్కడినుండి అంధికార రాజకీయ రాబంధులు తమ కడుపులోని కుళ్ళును నోటి ద్వారా రప్పించడంతో తెర మొత్తం జుగుప్సా కరంగా అసహ్యంగా మారుతుంది. మిక్కిలి పవిత్రమైన పదవిని ఎలా మకిలీ చెయ్యచ్చో ఈ నకిలీ ప్రజా సేవకులను చూసి తెలుసుకోవల్సిందే. చివరికి మూడో కూటమి ప్రతిపాదించిన వ్యక్తి భావోద్వేగానికి గురి అయి ఈ మాలిన్యంలో నేనుండలేనని చెప్పిన తరువాత కథ ముగుస్తుంది. తనే ప్రేక్షకులందరి చేత ‘సెభాష్’ అనిపించుకొంటాడు. సినిమా అంతా అయిన తరువాత ప్రేక్షకులు ఒక భావో ద్వేగానికి(వాంతులకు, వికారాలకు) గురికావడం సమిష్టిగా పనిచేసిన దర్శకుల నైపుణ్యానికి ప్రతీక. ఇందులో నటించిన పూలూ ప్రసాద్ పలావ్ అందరి కన్నా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు.
-- :0: --
:
లేఖిని వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
అలా కారు కీస్ కోసం పరుగులు పెడుతున్న సీనుగాడికి కారు “గీ..గీ.. కుయ్యువ్..కుయ్యువ్…వుళ..వుళ.. హాండా..బోండా ” అని సౌండు వినిపించే సరికి కారు కీస్ కోసం కాక కారు దగ్గరికి ఇంట్లోని డోరు ద్వారా గరాజ్ లోకి పరుగెత్తాడు. అసలే కారు గరాజ్ మూసి వుండటం వల్ల కారు చేసే శబ్దం తో పాటు వెలుగుతూ ఆరిపోతూ వున్న కారు లైట్లు కనిపించాయి.అది చూసిన సీనుగాడికి విఠలా చార్య సినిమాలో ఒంటి కన్ను రాక్షసుడి గుహ సాక్షాత్కరించింది. ఎంత స్పీడుగా వచ్చాడో అంతే స్పీడుగా పి.టి. ఉష ను తలుచుకుని 'మాస్క్' సినిమాలోని జిం కారీ లా సుడి గాలి అయిపోయి కూతురున్న గదిలోకి ప్రవేశించాడు.
“తుర్ర్.. బుర్ర్.. కె..కె. కేకే.. తుర్ర్ బుర్ర్” అనుకుంటూ చేతిలో కారు కీస్ తో ఆడుకుంటూ కనిపించింది పుత్రికా రత్నం. దగ్గరకు పోయి “చీ..చీ.. బుజ్జి.. కన్నా.. కారు కీస్ ఇవ్వమ్మా” అని కీస్ తీసుకోబోయాడు. కారు కీస్ వెనక్కి తీసేసుకుని తన చిన్ని కాలుతో ఒక్క తన్ను తన్నింది. ఆ తన్నుడికి సీనుగాడి కళ్ళద్దాలు గాల్లో రెండు పల్టీలు వేసి కింద పడబోతే మహమ్మద్ కైఫ్ లాగా మూడు పల్టీలు వేసి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. మళ్ళీ దగ్గరకు పోయి “నా చిట్టి తల్లి కదూ ఆ కీస్ ఇచ్చెయ్యమ్మా” అని ముందుకు వంగాడు.
ఈ సారి కీస్ పక్కన పడేసి “తుర్ర్..తుర్ర్…” అని చొంగ తో ఓ పెద్ద గాలి బుడగ చేసి సీనుగాడి మొహమంతా పావనం చేసింది. మొహం కో-ఆప్టెక్స్ కట్ బనీనుతో తుడుచుకుని మళ్ళీ దగ్గరకి వెళ్ళి “నీకు అన్నీ మీ అమ్మ బుద్దులే వచ్చాయి. వేలెడంత లేవు కానీ నాతోనే ఆటలాడుకుంటున్నావే…”
అంతలో అలివేలు పేద్ద కేక పెట్టింది “ ఏమండీ ఇందాకా మీరు ఫోనులో వుంటే అమ్మాయి ఏడుస్తోందని ఏమీ దగ్గర లేక పోతే కారు కీస్ దాని చేతిలో పెట్టాను. అది ఆడుకుంటూ పానిక్ బటన్ నొక్కినట్లుంది.ఆ కీస్ తీసుకొని కారు సౌండును కాస్త ఆపండి వినలేక పోతున్నా.”
“అవును ఆ కాస్త సౌండే నువ్వు వినలేక పోతే. మూడేళ్ళ నుండు నీ నుండి వస్తున్న సౌండు వింటున్న నా పరిస్తితేంటి” అని మనసులో అనుకుని. ”ఆ..ఆ అలాగే తీసుకుంటున్నా” అన్నాడు. కారు కీస్ తీసుకోబోతే బుడ్డిది ఎడమ చేతిలోకి కీస్ తీసుకొని కుడి చేత్తొ సీనుగాడి చెంప మీద ఒక్కటిచ్చింది. ఛెంపలు నిమురుకుంటూ “ఏదో కళ్ళు అందంగా వున్నాయి కదా అని ఒక మంచి పేరు హరిణి అని పెడితే నాకు హరి హరాదులు గుర్తుకు వచ్చేటట్టు చేస్తావా? నీకు మీ అమ్మమ్మా వాళ్ళు పెట్టిన వీర వెంకట బాల త్రిపుర జ్ఞాన మంగ సుబ్బాయమ్మ అనే పేరే ఖాయం చేసుండాల్సింది.నిన్ను స్కూల్లో వేసేటప్పుడు ఆపేరుతోనే రిజిస్టర్ చేయిస్తా. అలా కాదు గానీ ఈ రొజునుండి నిన్ను బుడిగి అని పిలుస్తా”
హరిణి రెండు కాళ్ళతో “డిష్యుం.. డిష్యుం…” ఈ సారి సీనుగాడి గడ్డం అతిధ్యం స్వీకరించింది.
ఇలా అయితే నా పని హైద్రాబాద్ లో సిటీ బస్సెక్కిన ప్యాసింజర్ లా అయిపోతుందని బుర్రని గోడకే పదును పెట్టాడు. నగేష్ గాడికి కొడుకు పుట్టబోయే ముందు తను ప్రజెంట్ చేసిన బుక్కు గుర్తుకు వచ్చింది. బాల నేరస్తుల శిక్షణాలయం నుండి తప్పించుకుని వచ్చిన తరువాత డా: బాల్యేష్ జెఠ్మలాని వ్రాసిన ఆ బుక్కు పేరు “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి”. వాడికి ఇచ్చేముందుపి తనకు భవిష్యత్తులో అవసరమవుతుందేమోనని ఆ బుక్కుని కంఠతా బట్టీ వేసేసి కవర్ నలిగిపోతే ఈనాడు పేపర్ తో అట్ట వేసి ఇచ్చేశాడు. అప్పుడు తను చేసిన తెలివి పనికి ఒక్కసారి సంబరపడిపోయాడు. వెంటనే ఆ బుక్కుని గిర్రు మని రౌండేసి పదకొండో పేజీ దగ్గర ఆగి పోయాడు తన కీవర్డ్ సెర్చ్ కి మ్యాచ్ కాగానే. “పిల్లలు పాతది మరచి పోవాలంటే కొత్తది ఏదయినా అలవాటు చెయ్యాలి” అదే ఆ పేజీ సారాంశం.ఇప్పుడు కారు కీస్ మరిచిపోవాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి. నా కళ్ళద్దాలు ఇచ్చేస్తే..ఆహా భేషయిన అవుడియా. వెంఠనే అమల్లో పెట్టేశాడు.
అంతవరకు రెండు చేతులతో కీస్తో ఆడుకుంటున్న హరిణి కారు తాళాన్ని ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేత్తో కళ్ళద్దాలు తీసుకుని రెండింటితో ఆడుకోవటం మొదలు పెట్టింది. తాళాలు లాక్కో బోతే “వా…. వా…” అని రాగం మొదలుపెట్టింది.
“ఏమండీ ఇంకా ఎంత సేపు? ఆసలే కారు సౌండుకు చెవులు పగిలి పోతుంటే మీరు అమ్మాయిని ఏడిపిస్తారా?” బయటి నుండి అలి వేలు మండిపాటు.
చివరికి ఇలా కాదని అరబిక్ ట్యూన్స్ తో వున్న తెలుగు పాట లో నేటివిటీ కోసం వీణ సౌండును ఇరికించినట్లు కారు తాళాలు అలానే వుంచి కారు రీమోట్ లాక్ తో పానిక్ సౌండును ఆపు చెయ్యగలిగాడు. వెంటనే పాంటాప్ తీసుకుని “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి “ బుక్కులోని 11 వ పేజీ సూత్రం కొందరికి మాత్రం వర్తించదు అని రాసుకున్నాడు.
అప్పటికే సమయం మించిపెఒవడం వల్ల పుత్రికా రత్నాన్ని అలానే కారు సీట్లో వుంచి కారు సీటును తీసుకెళ్ళి కారులో పెట్టాడు.
అంతలో వేలు వచ్చి కారులో కూర్చుంది. సీనుగాడు లోపలికి వెళ్ళి డ్రెస్సు మార్చుకుని బూట్లు వేసుకుని వచ్చి కారు సీట్లో కూర్చున్నాడు.
“ఇంకా ఎందుకాలస్యం కారు స్టార్ట్ చెయ్యండి” అలివేలు.
“ఈ..ఈ..” అని పళ్ళికిలించాడు.
“ఆ ఇకిలిపేమిటి కారు స్టార్ట్ చెయ్యక”
ఈ సారి కళ్ళు మాత్రమే తిప్పాడు బేబీ సీటు వంక చూపిస్తూ.
“అలసిపొయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లా ఆ కళ్ళు తిప్పడమేమిటి తిన్నగా చెప్పచ్చుగా”
కళ్ళు తిప్పటంలో అనుభవం వచ్చేసిందో లేక అలివేలు అర్థం చేసుకుందో…” ఓ.. కారు కీసు పాప దగ్గర వుండిపోయాయా” అని
“బుజ్జు కన్నా! నాన్న కారు కీస్ ఇచ్చెయ్యమ్మా” అనగానే బుడిగి కీస్ తీసి వాళ్ళమ్మ చేతిలో పడేసింది. ఆ సీను చూసిన సీనుగాడికి “పిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి” అనే బుక్కుని పర పరా చింపేసి డా: బాల్యేష్ జెఠ్మలానీను కారు కిందేసి తొక్కించేయాలన్నంత కోపమొచ్చింది.
అలివేలిచ్చిన కీస్ తీసుకుని మళ్ళీ పళ్ళికిలించాడు కార్ స్టార్ట్ చెయ్యకుండా.
“మళ్ళీ ఏమయింది మీకు….ఓహో కళ్ళద్దాలు లేవా? ఆగండి” అని బుడిగిని చూసి “ చీ చూడమ్మా నాన్నకు రోడ్డు సరీగా కనిపించ దంట ఇవి లేక పోతే ఏ ట్రక్కంకుల్ నో, గ్రాండ్ మా కారునో గుద్దేస్తాడు. ఈ సారి నాన్నారొక్కరే కారెక్కినప్పుడు మనం ఇంట్లో వుండి కళ్ళద్దాలతో ఆడుకుందాం. ఓ సారిచ్చెయ్యమ్మా!. కావాలంటే కారు దిగిన తరువాతా మళ్ళీ ఇస్తాలే.”
బుడిగి తల అడ్డంగా ఊపింది.
“ఏమండీ మీ పర్సు ఇలా ఇవ్వండి” అని పర్సు తీసుకొని బుడిగికి ఇవ్వగానే కళ్ళద్దాలు ఇచ్చేసింది.పాం టాప్ తీసుకుని ఏదో నోట్ చేసుకో బోయాడు.
"ఇంతవరకు రాసింది చాల్లే"
అలివేలు ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకుని కారు స్టార్ట్ చేసాడు. తన పర్సు బదులు అలివేలు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వచ్చుగదా అనే చచ్చు ప్రశ్నలు వెయ్యలేదు సీనుగాడు, ద జెంటిల్ మెన్. డా: దుమారం రాసిన బుక్కులు చదవడం వల్ల కలిగిన జ్ఞానం అది.
కారు పార్కింగ్ లాట్లో ఆపాడో లేదో దూరంగ ఒక దేశీ జంట కనిపించింది. వాళ్ళు కనిపించగానే అలివేలు “అదిగో చూడండీ ఎవరో దేశీలు” అంది.
“సర్లేవే దేశీలు షాపింగ్ చెయ్యరా ఏంటి” అన్నాడు కారు పార్క్ చేసి. కారు తాళాలు బుడిగికి ఇచ్చేసి తన పర్సు తీసుకుని కారు సీటును స్ట్రాలర్ లో పెట్టాడు.
అలా కొంత దూరం రాగానే ఆ దేశి జంట వీళ్ళ దగ్గరకు వచ్చి పలకరించింది.
“హలో, హౌ ఆర్యూ? ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యు బిఫోర్” అన్నాడు.
సీనుగాడి బుర్రలో ఎర్ర లైటు దేదీప్యమానంగా వెలిగి పోతోంది. తరువాత ఏమంటాడో కూడా తెలుసు.
“హె యు లైక్ తెలుగు పీపుల్. ఆర్ యు ఫ్రం ఆంధ్రా?” మళ్ళీ తనే అన్నాడు.
మిగిలిన సీనంత సీనుగాడికి అర్థమయి పోయింది. తర్వాత వాడు “మీరేమి చేస్తారు అంటాడు. మనము అడక్కపోయినా వాడికో బిజినెస్ వుందంటాడు.దాని పేరు ఈ కామర్సంటాడు. దానికో బంగారు తీగుందంటాడు.తొంగుంటే మీ నోట్లే కరిగిస్తానంటాడు. దాన్ని మీ ఇంట్లో వేస్తానంటాడు. వాడి వెనకో మిలియనుందంటాడు. రెసిడ్యువల్ ఇన్ కమంటాడు. నువ్వు ముగ్గుర్ని చేర్పించాలంటాడు. తరువాత పిరమిడ్ అంటాడు. మమ్మీ లంటాడు, ఈజిప్టు అంటాడు, ఆఫ్రికా అంటాడు. వీళ్ళ దుంప తెగ ఇంతకు ముందు ఇలాంటోళ్ళు ఒంటరి గాళ్ళనే పట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఏకంగా జంట గా వచ్చి జంటలకే టెండర్ వేస్తున్నారు. ఇలా ఆలోచించేలోపే ఆ వచ్చినోడి ఆవిడో మరే ఆవిడో తెలీదు కానీ అలివేలుతో తొక్కుడు బిళ్ళాడేసి, “అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ” అన్నంత క్లోస్ అయిపోయి బుడిగిని ఎత్తుకొని ఆడిస్తోంది.
ఇలా పరిచయాలు పెంచుకొని వాళ్ళ స్కీముల్లో చేరమని వెంట పడతారు. ఇక్కడే తుంచెయ్యటం మంచిది.
“మాస్టారూ మీది హైద్రాబాదా” ఆ సచ్చినోడి పలక్రింపు.
“కాదు పులివెందుల”
“మీరేమి చేస్తుంటారు”
“బాంబులు తయారు చేస్తుంటా”
“మీరు భలే జోకులు వేస్తారు. మీ లాంటి వాళ్ళుంటే మా బిజినెస్ చాలా బాగా ప్రాస్పర్ అవుతుంది. ఇంతకూ మీరు ఖాళీ సమయాల్లో ఏమి చేస్తుంటారు”
“రేప్ లు చేస్తుంటా” ఆ వచ్చినావిడ వైపు కొర కొరా చూస్తూ అన్నాడు సీనుగాడు,అప్పుడప్పుడూ ద ఫైర్ ఇంజెన్.
సీను అర్థమయి పోయిన ఆ దేశీ జంట పరుగో పరుగు.
“ఎందుకండీ వాళ్ళనలా బెదర్గొట్టేశారు” అలివేలు.
“నీకు అన్నీ చెప్పా గానీ ఈ ఒక్క ఎపిసొడ్ గురించి చెప్పలేదు కదూ. ఇలా కొంత మంది పరిచయాలు పెంచుకొని మీ బాసుని కాల్తో తన్నెయ్, మీ కంపెనీని గోటితో గోకెయ్ అని చెప్పి ప్రమోషన్ స్కీములంటూ ఇంటికొచ్చి పడతారు. ఇంట్లో వున్న చెట్లకు పుట్లకు డాలర్లు కాస్తాయ్ అని చెప్తారు”
“అవేమి స్కీములండీ?”
“ఇప్పుడవన్నీ ఎందుకులే తొందరగా పదా ఎవరన్న దేశీలు ఇలా పలకరించారంటే దానర్థం వాళ్ళకు ఇలాంటి ఈ-కామర్స్ బిజినెస్ లున్నాయని అర్థం. ఇలాంటోళ్ళను చూడగానే వై.యెస్. కిలారి పాల్ ను చూసినట్టు చూడాలి”
“అలాగలాగే ఏదో అడిగాం కదా అని పెద్ద యండమూరి లాగ కథ చెప్పకండి. ముందు ఈ స్ట్రాలర్ తీసుకుని బుడ్డి దాన్ని ఆడిస్తూ వుండండి”
మాల్ లోకి ప్రవేశించారు. ముందు అలివేలు నడుస్తుంటే వెనక స్ట్రాలర్ తోసుకుంటూ సీనుగాడు. అక్కడ వెళ్తున్న అందమైన అమ్మాయిల వంక అలివేలు వంకా చూసుకుంటూ “ప్చ్! పెళ్ళప్పుడు వర్షం సినిమాలో త్రిష లాగుండే నా భార్య ఇప్పుడు కిత కితలు సినిమాలో అల్లరి నరేష్ భార్య గీతా సింగ్ లాగా అయిపోయింది” అనుకున్నాడు. నడక లో కొంచె వెనక పడ్డాడు సీను గాడు. వాళ్ళావిడ కనిపించక్ పోయేసరికి ఆత్రంగ వెతికాడు ఒక షాపు దగ్గర. అక్కడ అలివేలు ఎవరో దేశీ జంటతో మాట్లాడుతోంది.
“ఎన్ని చెప్పినా వినదు ఈ అలివేలు. మళ్ళీ ఏ ఆమ్వే జంటో క్విక్ స్టార్ జంటో తగిలినట్లుంది. లాభం లేదు ఈ సారి దులుపెయ్యాలి అని ఆంజేయ స్వామి దండకం అక్కడే నాలుగు సార్లు చదివి కానిఫిడెన్స్ వచ్చాకా అయిదో సారి చదువుకుంటూ దగ్గరికి వచ్చాడు.
“హె శ్రీనివాస్, బావున్నావా? నువ్వు ఇండియా వెళుతున్నావని తెలిసింది.” పాత ఆఫీసులో పని చేసే మనొహర్. వాళ్ళావిడతో కలసి షాపింగ్ కు వచ్చినట్టున్నాడు.
“హె మనోహర్ బావున్నా నువ్వెలా వున్నావ్?”
“బాగున్నా. మొత్తానికి మూడేళ్ళ తరువాత వెళ్తున్నావ్. హైద్రాబాద్ చాల మారిపోయింది తెలుసా? అక్కడ సైట్లు ఏమైనా కొంటున్నావా? నా బామర్ది రియాల్టర్ గా పని చేస్తున్నాడు.” మనోహర్
“అవునండీ మా తమ్ముడు బాగానే సంపాదిస్తున్నాడు అక్కడ. మీకు కావాలంటే చెప్పండి కొంచెం తక్కువకు ఇప్పిస్తాడు" వాళ్ళావిడ. "అప్పిస్తాడా?" సీనుగాడు
"లేదండీ కావాలంటే అప్పిప్పిస్తాడు"
"అప్పిస్తాడా?"
"అలాంటి పనులు చెయ్యడండీ"
"నా దగ్గిర ఓ నాలుగు వేలు రూపాయలు మిగలచ్చు. దానితో ఏదయినా ప్లాటు కొనచ్చా?"
"నాలుగు వేలతో ఏమీ రాదండీ"
"నాలుగు వేలు డౌన్ పేమెంటు ఇచ్చినా ఏమీ రాదా"
"రాదండీ"
"అలా అయితే నాకేమీ ఒద్దండి"
ఇదంతా చూసిన మనోహర్ కల్పించుకొని "అరె శ్రీనివాస్ ఈ మధ్య బాగా జోకులు వేస్తునావ్. అది సరే గానీ ఈ మాల్ కి ఇండియా షాపింగ్ కోసం వచ్చారా"
"లేదు కాంబోడియా కెళ్ళి ఇక్కడ కొన్న డ్రెస్సులు అక్కడ ఒరంగ్ ఉటాన్ లకు వేసి టైటుగా వున్నాయో లూజుగా వున్నాయో కనుక్కుందామని"
"అబ్బా నవ్వ లేక చచ్చిపోతున్నా శ్రీనివాస్. ఇక ఆపేయ్"
"అలాగే ఇక మేము వెళ్ళమా?"
"అరే చెప్పడం మర్చిపోయా నువ్వు ఇండియా వెళ్తున్నావని తెలిసే మేము కూడా షాపింగ్ కు వచ్చాం."
నేను ఇండియా వెళ్తుంటే వీడు షాపింగ్ చెయ్యడమేమిటి? ఎర్ర బల్బు పెద్ద కాంతితో "నువ్వు మళ్ళీ డమాల్" అంది.
"అలాగా! ఏం పాపం మీరు ఇండియా వెళ్ళేటప్పుడు డబ్బుల్లేవా?"
"వున్నాయి కానీ మొన్న ఇండియాకు ఫోను చేసినప్పుడు నా తమ్ముడికి ఒక మంచి రీమోట్ కంట్రోల్ హెలికాప్టర్ కావాలన్నాడు. అది కొని మీ చేత పంపిద్దామని అనుకొ...."
"వేలూ. డూ యూ నో హూ దిస్ ఫెల్లో ఈజ్?. లెట్స్ డూ అవర్ షాపింగ్ ఫాస్ట్" అని స్ట్రాలర్ నెట్టుకుంటూ అక్కడున్న గుంపులోకి దూరిపోయాడు.
మనోహర్, వాళ్ళావిడ తేరుకుని చూసేసరికి సీనుగాడి ఫ్యామిలీ మొత్తం మాయం.
"నీ జిమ్మడ! నువ్వు ఏదయిన సైటు కొను హైద్రాబాదు లో మా తమ్ముడికి చెప్పి ఏదో ఒక లిటిగేషన్ పెట్టిచేస్తా" అని శాపనార్థాలు పెట్టింది మనోహర్ వాళ్ళావిడ.
వాళ్ళనుండి తప్పించుకొచ్చిన సీనుగాడు సోనీ షాపులో దూరి 62'' టీ.వి. వెనక నక్కి దాక్కునాడు. అక్కడ ఎవరూ దేశీలు లేరు అని తెలిసినప్పుడు మాత్రం బయటికి వస్తున్నాడు.
"వేలూ, ఇలా అయితే మనము షాపింగ్ చేసినట్లే. నేను వెళ్ళి ఆ ఫుడ్ కోర్టు పక్కన మూల నున్న టేబుల్ దగ్గర దాక్కోని మన బుడ్డి దాన్ని చూసుకుంటూ వుంటాను నువ్వు షాపింగ్ ముగించుకొని వచ్చెయ్" అన్నాడు.
"అలాగే పాప జాగ్రత్త" అని అలివేలు వెళ్ళి పోయింది.
ఫుడ్ కోర్టు లో మూల వున్న టేబుల్ దగ్గరకెళ్ళి అటు వైపు తిరిగి కారు సీట్లోకి మొహం పెట్టి పాపతో ఆడుకుంటున్నట్లు నటిస్తూ వున్నాడు.
ఇంతలో బుడ్డిదానికి ఆకలి వేసి కెవ్వు మంది. పాపం ఆకలిగా వున్నట్లుంది పాలు కలుపుదామని తల పైకెత్తి పాల డబ్బా కోసం ఇటు తిరిగాడు.
"అరే సీను! నువ్వా ఎవడో సన్నాసి వెధవనుకున్నాను" ఎత్తుపళ్ళ నరసిం హం గాడు.
(సశేషం)
:
గుండె నిండు టపానొక్కటైనను చాలు హండ్రెడయిననేమి చెత్త టపాలు స్పూర్తి కలుగు టపా పక్షానికొక్కటైనను చాలు బ్లాగదాభి రామ బ్లాగర విహారి
గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వధాభి రామ వినుర వెమ
:
కొందరు బ్లాగింగూ ఇంకొందరు నాగింగూ
కొందరు అలిగింగూ ఇంకొందరు గులుగింగూ
కొందరు లాగింగూ ఇంకొందరు రన్నింగూ
కొందరు రిగ్గింగూ ఇంకొందరు మగ్గింగూ
కొందరు లింకింగూ ఇంకొందరు లింపింగూ
కొందరు రీడింగూ ఇంకొందరు స్లీపింగూ
కొందరు హైడింగూ ఇంకొందరు హైబర్నేటింగూ
రాస్తా ఏదైనా అందరూ కూడలింగే అపుడో... . ఇపుడో.... ఎపుడో ....
ఏమీ తోచక పోతే "పరదేశి" సినిమా లో పాట ".... కొందరు నూడుల్సూ.. ఇంకొందరు బర్గర్సూ.." వింటుంటే వచ్చిన హైపర్ పైత్య పేరడీ ఇది.
:
ఈ మధ్య తెలుగు బ్లాగులు కుప్పలు తెప్పలు గా వచ్చేస్తున్నాయ్. ఇదొక మంచి పరిణామం. ఏదో ఒకటి బరుకుతూనే వున్నారు. వార్తలు చదివడం తక్కువయిపోయి బ్లాగులు పట్టుకుని వేలాడే వాళ్ళెంత మందో. నా మటుకు నేనయితే మొన్నా మధ్య ఆఫీసులో కోడ్ రాస్తూ Clob datatype తో variable ఎలా డిక్లేర్ చేశానంటే clob_data బదులు blog_data అని. కంపైల్ చేస్తే ఇంకే ముంది? స్క్రీన్ నిండా అక్షింతలే. అలా బ్లాగులు చదివి అలసిపోయి వ్యాఖ్యలు రాయడానికి సమయం లేకుండా పోతున్న వాళ్ళ కోసం రాసింది ఇది. చెప్పాలనుకున్నది inscript లోనో RTS లోనో టైపు చేసి రాసే బాధ తప్పించుకోడానికి కొన్ని మార్గాలు అన్వెషించా. అన్నింటికి పుట అక్షరాలు కనిపెడితే ఎలా వుంటుంది అనే “మంచి దుర్మార్గపు” ఆలోచన వచ్చింది.(దుర్మార్గులలో కూడా మంచాళ్ళుంటారని అందరూ సహృదయత అర్థం చేసుకుంటారు కదూ). ఈ పుట అక్షరాలనే SMS లో వాడుతారు కదా. కొంచెం తిలకించండి. వీలయితే మీరూ కలపండి.
1. బా. (బావుంది) 2. చా.బా. (చాలా బావుంది) 3. చా.చా.బా (చాలా చాలా బావుంది) 4. అ.వు. (అధ్భుతంగా వుంది) 5. మ.వు. (మహాద్భుతంగా వుంది) 6. ఏ. (ఏడ్చినట్లుంది) 7. బా.రా. (బాగా రాసారు) 8. చా.బా.రా.(చాలా బాగా రాసారు) 9. అ.రా. (అద్భుతంగా రాసారు) 10. చ. (చండాలంగుంది) 11. చా.చ. (చాలా చండాలంగుంది) 12. బా.చె. (బాగా చెప్పారు) 13. చ.బా.చె. (చాలా బాగా చెప్పారు) 14. సూ. (సూపర్) 15. సూ.సూ. (సూపరో సూపరు) 16. అరి. (అదిరింది) 17. ఆ.చే.వ్యా.(ఆలోచింప చేసే వ్యాసం) 18. వీ.బు.రా.(వీళ్ళకు బుద్ది రాదు) 19. బా.నా. (బాగా నవ్వించారు) 20. బా.లో.సు.(బ్లాగు లోకానికి సుస్వాగతం) 21. అర్స్. (అదుర్స్) 22. అ.గొ.సా. (అదర గొట్టే సారు) 23. మ.వ్య.అ.ధ్య.(మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు) 24. హ1 (హహ్హ) 25. హ2 (హ..హ్హ..హ్హ) 26. ఆ.ట. (ఆలోచింప చేసే టపా) 27. చి. (చిమపెశావ్ పో) 28. మ.ట.ఎ.(మరిన్ని టపాల కోసం ఎదురుచూస్తూ) 29. మీ.వి.చా.బా.(మీ విశ్లేషణ చాలా బావుంది) 30. మీ.హా. (మీకు హ్యట్సాఫ్) 31. మీ.బ్లా.నా.బ్లా.ఒ. (మీ బ్లాగు నాకు నచ్చిన బ్లాగుల్లో ఒకటి) 31. మీ.క.చా.బా. (మీ కవితలు చాలా బావుంటాయి) 32. చా.రో.మ.ట. (చాలా రోజులకు మంచి టపా చూసా.)
(ఎప్పట్నుండో హెడ్లైన్ మాత్రమే రాసి పక్కన పెట్టిన వ్యాసానికి ఈ రోజు ఊపిరి వచ్చింది.)
ఎండా కాలం ఒచ్చిందంటే జాలు ఇంగ పిల్లోళ్ళందురుకీ పండగ. నాకబ్బుడు గెట్టిగా ఏడెనిమిది సమత్సరాలు గూడా లేవు. ఎబ్బుడు జూసినా ఆ చెరువుల కల్ల బాయిల కల్ల బడి తిరిగే పనే ఇరవై నాలుగ్గంటలూ. ఇస్కూల్లో లాస్ట్ రోజు స్కూలు పిల్లోడు ఒగడు రెండు చేతులూ చాంపుకొని దాని మింద రిజిస్టరు ని పెట్టుకోని క్లాసులోకి ఒచ్చేది కిటికీలో నుండి కనబడితే జాలు పక్కనోడిని ఆనందంతో వాడి రెట్ట మింద గిల్లేసి కొట్టేసి “ఒరేయ్ శేఖిర్ గా ఆడ జూడ్రా లీవులు చెప్పే బుక్కు ఒస్తా వుంది” అంటే.
దానికి వాడు రెట్ట రుద్దుకుంటా “అవును య్యోవ్ పొద్దున్నుండి అనుకుంటానే వుండా ఈ బుక్కు ఇంగా రాలేదేంది అని. ఇంగొచ్చేసింది గదా. మ్యాడం దాన్ని జదివి పొట్టి సంతకం పెట్టేస్తుంది. ఇంగ మనం లీవులంతా చేనుకాడికి, మడికాడికి పోవచ్చు. ఈ తూరి మామిడికాయిలు ఎక్కువ గదా మా తోపు లో కొచ్చేయ్ ఆడ మనం ఆడుకుందాం”.
“సరేరా ఆ పురుషోత్తంగాడిని మాత్రం పిలొద్దు మనం. వాడు మొన్న అత్తిరాసం ఇమ్మంటే ఈలా”. “అట్లే లే య్యా”
ఇంతలో మ్యాడం ఆ బుక్కు తెచ్చినోడి నుండి బుక్కు తీసుకోని జదువుతుంది “ఈ సంవత్సరం బడి అయిపోయింది. మీ అందరికి ఈ రోజు నుండి అంటే ఏప్రిల్ 23 నుండి జూన్ 12 దాకా లీవూలు ఇస్తున్నారు. బడి జూన్ 13 వ తేదీ తెరుస్తారు. ఒకటో తరగతి పిలకాయలు రెండో తరగతికి. రెండో తరగతి పిలకాయలు మూడో తరగతికి పోతారు”. అంతే ఇంగేముంది ఇంకు పేనా తీసి సంతకం పెట్టి ఆ బుక్కు తెచ్చినోడికిచ్చేస్తే వాడు వాని నాలుగో క్లాసుకు వెళ్ళి పోతాడు. అంటే పక్క బిల్డింగ్ అన్న మాట. అందులో మూడు నాలుగు, అయిదు క్లాసులకు ఒగ అయివోరు వుంటాడు. ఆ అయివోరే లీవులు ఇస్తాడు. వాడు వెళ్ళిపోంగానే ఆ పెంకులిస్కూలు టాపు ఎగిరిపోయేటట్టు అందురూ అరుస్తారు. మ్యాడం “రేయ్, సైలంట్ గా వుండండి. ఇంగో గంట్లో స్కూల్ ఇసిపిట్టే బెల్లు గొడతారు అబ్బుడు అందురూ ఇంటికి పోవచ్చు.
ఇప్పుడు పైన చెప్పిన సీను చిత్తూరు జిల్లా, లద్దిగం గ్రామం లోని ప్రాథమిక పాఠశాల, డెబ్బయ్యవ దశకం. ఆ మ్యాడం మా అమ్మ. ఆ అయివోరు మా నాన్న. మొత్తం స్కూల్ స్టాఫ్ ఇద్దరే.బెల్లĹ |